
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జ్ఞాన ప్రకాశ్ 3.0 ఎఫ్ఎల్ఎన్ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాన్ని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డి ఆర్ పి లకు సమీక్ష నిర్వహించి,శిక్షణా తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.విద్యార్థుల అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు పాఠశాలల్లో టీఎల్ఎం కార్నర్, డ్రాయింగ్ కార్నర్, బుక్స్ కార్నర్ వంటి అభ్యాస వనరులను ఏర్పాటు చేయాలని సూచించారు. తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించాలని తెలిపారు.
అలాగే కరికులం గోల్స్ ఆధారంగా నిర్దేశించిన అభ్యాస లక్ష్యాలను సాధించేలా బోధన కొనసాగించాలని, పాఠ్యపుస్తకాన్ని ప్రధాన బోధన వనరుగా ఉపయోగిస్తూ విద్యార్థి కేంద్రిత బోధన చేపట్టాలని పేర్కొన్నారు. ఆటలు, పాటలు, కార్యకలాపాల ద్వారా జాయ్ఫుల్ లెర్నింగ్ వాతావరణాన్ని కల్పించి ప్రతి విద్యార్థి చురుకుగా పాల్గొనేలా చూడాలని సూచించారు.
విద్యా క్యాలెండర్ను అనుసరించి నిర్దేశిత సమయానికి అన్ని అంశాలను బోధించాలని, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. శిక్షణా కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోర్స్ ఇన్చార్జి, ఎంఈఓ–1 శ్రీ ఎం.ఎన్.కే. శర్మ, కోర్స్ డైరెక్టర్ శ్రీ కె. సుబ్బారెడ్డి మరియు డీఆర్పీలు పాల్గొన్నారు.