తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ పర్యవేక్షణలో, సీఐ కనిగిరి , ఎస్‌ఐ హెచ్.ఎం. పాడు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, అధిక వేగం, తప్పు దిశలో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం వంటి అంశాలపై ప్రజలకు విపులంగా వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే ముఖ్యమైన భద్రతా సాధనమని గుర్తు చేశారు.అలాగే రోడ్డు నియమాలు పాటించడం, వాహనాలను పరిమిత వేగంతో నడపడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మొబైల్ ఫోన్ ఉపయోగించి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి, తమ కుటుంబాల భద్రతను కాపాడుకోవాలని పోలీసులు సూచించారు.ప్రజల భద్రతే ముఖ్య లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఇలాంటి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుత పాత్ర పోషించాలని కోరారు.