తొలి శుభోదయం టంగుటూరు :-
టంగుటూరు మండలానికి చెందిన ప్రముఖ రచయిత శివపురం ఈశ్వర్ చల్లా సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ లిటరేచర్ అవార్డు – బెస్ట్ రైటర్ అవార్డును శనివారం అందుకున్నారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖులు మరియు అతిథుల సమక్షంలో ఈ అవార్డును ప్రముఖ నటుడు, ప్రజాప్రతినిధి బాబు మోహన్ ఈశ్వర్ చల్లా చేతికి అందజేశారు.ఈ సందర్భంగా వేదికపై ఈశ్వర్ చల్లా ని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సభకు హాజరైన సాహితీవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు.గ్రామీణ జీవన విధానం, సామాజిక విలువలు, యువత ఆలోచనా విధానాలు, మానవ సంబంధాలపై స్పష్టమైన దృష్టితో రచనలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈశ్వర్ చల్లా తన కలం ద్వారా సమాజానికి మార్గదర్శకత్వం అందిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఆయన రచనల్లో ఉన్న భావోద్వేగ పరిమళం, భాషా సరళత, సమకాలీన సమస్యలపై లోతైన విశ్లేషణ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.అవార్డు స్వీకరించిన అనంతరం ఈశ్వర్ చల్లా మాట్లాడుతూ,
“ఈ గౌరవం నా ఒక్కరిది కాదు. నా కుటుంబ సభ్యులు, నా ఊరు, నా పాఠకులు, నన్ను ప్రోత్సహించిన గురువులందరికీ అంకితం. సాహిత్యం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే నా లక్ష్యానికి ఇది మరింత బలాన్నిచ్చింది” అని అన్నారు.బాబు మోహన్ మాట్లాడుతూ,
“గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సాహిత్య ప్రయాణం చేసి ఈ స్థాయికి చేరడం గొప్ప విషయం. ఈశ్వర్ చల్లా రచనలు యువతకు దిశానిర్దేశం చేసేలా ఉన్నాయి. ఇలాంటి రచయితలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదే” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీ, సాహిత్య ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తంగుటూరు మండలానికి చెందిన రచయితకు జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం, ఆ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిందని పలువురు తెలిపారు.శివపరం ఈశ్వర్ చల్లా ఈ విజయంతో తంగుటూరు మండలంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామ ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.