తొలి శుభోదయం సింగరాయకొండ:-

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ సంస్థలలో వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని మహాలక్ష్మి ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారిని పి.జయమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య పునాది అయిన రాజ్యాంగం గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం, వారికి పౌరస్పూర్తి కలిగించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.
రాజ్యాంగం మన దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించే పవిత్ర గ్రంథం. ప్రతి విద్యార్థి తాను ఒక బాధ్యత గల పౌరుడిగా ఎదగాలంటే రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు, విలువలు తెలిసి ఉండాలి” అని పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు ప్రాథమిక విధులు హక్కులు పై అవగాహన కల్పిస్తూ,
విద్యార్థులకు వారి మౌలిక హక్కులు, మౌలిక బాధ్యతలు, రాజ్యాంగ నిర్మాణం,పార్లమెంటు–న్యాయవ్యవస్థ–కార్యనిర్వాహక వ్యవస్థల పాత్రలను ఉదాహరణలతో సహా వివరించారు.రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర వహించిన సభ్యుల సేవలు, వారి విలువలు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషి గురించి అవగాహన పెంచారు.కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు సామాజిక బాధ్యతపై అవగాహన,
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల ప్రాముఖ్యత, చట్టాల పట్ల గౌరవం, సమాజ సేవ వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించారు.రాజ్యాంగ పరిచయం, రాజకీయ వ్యవస్థ నిర్మాణం, రాజ్యాంగ రచయితలు, ముఖ్యంగా డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు గురించి వివరించారు.కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయిని మహాలక్ష్మి అధ్యక్షత వహించగ,పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టుకోవడంలో అందరూ చురుకుగా ఉండాలని ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *