తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ అవగాహన మరియు డౌన్లోడ్/ఇన్స్టాలేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దర్శి శక్తి టీమ్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల సిబ్బంది సహకారంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పవరం ఎస్సీ కాలనీ (దర్శి)లో GMSK, అంగన్వాడీ సిబ్బందితో కలిసి మహిళలకు శక్తి యాప్ వినియోగం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అదేవిధంగా సందువనిపాలెం ప్రాంతంలో మహిళలపై జరిగే నేరాలు, గృహ హింస, వేధింపులు, చట్టపరమైన రక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.అలాగే అద్దంకి పట్టణంలోని కట్టక్రిందపాలెం 19వ వార్డులో దర్శి శక్తి టీమ్, GMSK సిబ్బందితో కలిసి శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించి, మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా లభించే సేవలపై వివరించారు.ఇక ఒంగోలు DRDA కార్యాలయంలోని వెలుగు ఆఫీస్‌లో, వ్యవసాయ పద్ధతులపై శిక్షణ పొందుతున్న ట్రైనీలకు శక్తి యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి, యాప్ డౌన్లోడ్ & రిజిస్ట్రేషన్ చేయించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, శక్తి యాప్ ద్వారా SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, డయల్ 112/100, మహిళా హెల్ప్‌లైన్ 181 వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా శక్తి యాప్‌ను వినియోగించి వెంటనే పోలీసుల సహాయం పొందాలని సూచించారు.మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, మహిళలపై నేరాలను అరికట్టడం, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రతి మహిళ శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.మహిళల భద్రత, సమాజ శాంతి పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.