త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి ఉద్యమస్ఫూర్తి నేటికీ మార్గదర్శకం: ప్రకాశం జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం:-
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73 వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది శ్రీరాములు గారి చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరుడయ్యాడని, ఆయన బలిదానం ఫలితంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించిందని, తద్వారా భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. గాంధీ మార్గాన్ని అనుసరించి అనేక జాతీయ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించారని, సత్యం, అహింస అనే ఆశయాలతో హరిజనుల ఉద్ధరణకు కృషి చేశారని, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని జిల్లా ఎస్పీ కొనియాడారు. గొప్ప దేశభక్తుడు, సమాజసేవకుడు, పీడిత ప్రజల పక్షపాతి, అసలైన గాంధేయవాది అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఉద్యమస్ఫూర్తి, కార్యదీక్ష, త్యాగనిరతి నేటి తరానికి గొప్ప ఆదర్శమని తెలిపారు. మహానుభావుల త్యాగాలు, ఆదర్శాలను స్మరించుకోవడం ద్వారా దేశభక్తి, సేవాభావం మరింత పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్,డీటీసీ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఆర్ఐ రమణరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
