తొలి శుభోదయం కందుకూరు:-
స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ, ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ప్రణాళిక యుతంగా అధ్యయనం చేసి, మంచి మార్కులు పొందాలని సూచించారు. కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు పలకడం ఒక సత్ సాంప్రదాయమన్నారు. విద్యార్థులు ఏక మనస్కులై, పాఠ్యాంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు, జీవితంలో అత్యున్నత స్థాయిలలో స్థిరపడేందుకు ఇప్పటినుండే కృషి చేయాలని ఆయన తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి రాజకీయ శాస్త్ర సీనియర్ అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు చుండూరి బాబురావు , గణిత శాస్త్ర అధ్యాపకులు బొప్పరాజు వెంకట కాశీరత్నం , హజరత్తయ్య,TRR రాజు, రావలకొల్లు మాధవరావు , కట్టా సుబ్బారావు ప్రసంగించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో, విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా అలరించాయి.