తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల రోడ్డునుఆ ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు నిర్మాణాలు చేపట్టి వారికి కనీస వసతులను ఏర్పాటు చేయాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప్పు చెరువు ప్రాంత కాలనీవాసులతో కలిసి సబ్ కలెక్టర్ దామెర హిమ వంశీ కి వింత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పు చెరువు ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాల నుండి నివాసముంటున్న ప్రజలకు రోడ్డు మార్గం లేకుండా కొందరు ఆక్రమణ చేసి వారికి ఇబ్బందులు కలిగిస్తూ అడ్డుకున్న వారిపై ఆక్రమణదారులు దాడి చేసిన సంఘటన జరిగిందని, అది సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. ఇరిగేషన్ కు సంబంధించిన ఉప్పు చెరువు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకొని ప్రైవేటు వ్యక్తులు ఎలా వెంచర్లు వేస్తున్నారని, అక్రమంగా వెంచర్లు వేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బహిరంగంగానే స్థలాలు ఆక్రమణలు జరుగుతుంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నిమ్మకు నీరేత్తినట్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు. ధనవంతులకు ఒకలా పేదవారికి ఒకలా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ అధికారులు సైతం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అన్ని ఆక్రమణలు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉప్పుచెరువు ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆ ప్రాంత స్థానికులతో కలిసి సిపిఐ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు యర్రంశెట్టి ఆనందమోహన్, చేవూరి దుర్గాప్రసాద్, ఉప్పుటూరి మాధవరావు, బొల్లోజుల బాల బ్రహ్మచారి కోటేశ్వరరావు ఉప్పు చెరువు ప్రాంత స్థానికులు తదితరులు పాల్గొన్నారు.