తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో ఒంగోలు పట్టణంలోని ప్రగతి కాలనీలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం మరియు ముఖ్యంగా మాదకద్రవ్యాల కట్టడి లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్ సందర్భంగా కాలనీలోని అనుమానిత ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. స్థానిక ప్రజలతో మమేకమై, వారి ప్రాంతంలో ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశంపై ఆరా తీశారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.తనిఖీల అనంతరం గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం, కాలనీ వాసులతో కలిసి “డ్రగ్స్ రహిత సమాజం” కోసం పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు.ప్రగతి కాలనీ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. “గంజాయి వద్దు – జీవితం ముద్దు” అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. ప్రజల సహకారం ఉంటేనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పోలీస్ అధికారులు, భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.