తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు కనుమల్ల గ్రామపంచాయతీని సందర్శించి శుభ్రత, పారిశుధ్యం, పన్ను వసూళ్లు మరియు వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం సక్రమంగా జరుగుతున్నదా, క్లాప్ మిత్రులు ఇంటింటి వెళ్లి పనితీరు ఎలా ఉన్నదనే అంశాలను నేరుగా పరిశీలించారు. చెత్త దిబ్బలు ఏర్పడకుండా ఉండటానికి సైడ్ కాలువలను నిరంతరం శుభ్రపరిచేలా సూచించారు. అలాగే గ్రామంలో జ్వరాలు, అంటురోగాలు వ్యాపించకుండా ఆరోగ్య విభాగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా ఆయన గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం ఎంత ముఖ్యమో వివరించారు. ఆపై హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు శుభ్రత అలవాట్ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానిస్తూ, గ్రామానికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని అభినందించారు.ఇంటి పన్నులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని పిడిఓ, సచివాలయ సిబ్బందికి ఆయన స్పష్టంగా చెప్పి, క్యూఆర్ కోడ్ ద్వారా పన్నులు స్వీకరించడం వలన పారదర్శకత పెరుగుతుందని, గ్రామ ఆదాయ వనరులు కూడా మెరుగవుతాయని సూచించారు. పన్ను వసూళ్లలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో జయమని , డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు , పిడిఓ శాంతి, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు భైరపునేని మోహనరావు, మలినేని వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కనుమల్ల గ్రామాభివృద్ధికి అధికారులు చూపిన ఆసక్తిని స్థానిక ప్రజలు అభినందించారు.
