తొలి శుభోదయం ప్రకాశం:-
రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు ది.22.12.2025 నుండి తొమ్మిది నెలల శిక్షణ ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ది.16.12.2025న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు ఎంపికైన 281 మందిలో (సివిల్ 88 మంది పురుషులు, 38 మంది మహిళలు, APSP – 155 మంది)కానిస్టేబుళ్లతో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కానిస్టేబుళ్లు శిక్షణా కాలంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి నిర్వహణలో ఉండాల్సిన బాధ్యతపై వారికి అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాలమేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు దిశా నిర్ధేశం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ముందుగా ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం అనేది అత్యంత బాధ్యతతో కూడినదని, ఇకపై వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. రానున్న కాలంలో టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతున్నందున, శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.కానిస్టేబుల్ అనేది పోలీసు శాఖకు వెన్నుముక్క లాంటిదని, కానిస్టేబుళ్లు లేకుండా పోలీసు శాఖను ఊహించలేమని, క్షేత్రస్థాయిలో వారు అందించే సేవలపైనే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా సైబర్ నేరాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రత, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి ప్రతి అంశంలో కానిస్టేబుల్ పాత్ర అత్యంత కీలకమన్నారు.శిక్షణా కేంద్రాల్లో అందుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకుని, తొమ్మిది నెలల శిక్షణను ఉత్తమంగా పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పోలీసు అధికారులు ఆకాంక్షించారు. అనంతరం, విజయవాడకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణాన్ని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, డీటీసీ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఆర్ఐ రమణారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
