ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్ తమ ప్రైవేటు వీడియోలు తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినుత కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె డ్రైవర్ హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటికి రావడం, అందులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పాత్రపై ఆరోపణలు ఉండటంతో ఈ వివాదంలో ట్విస్ట్ ఎదురైంది.ఈ నేపథ్యంలోనే కోట వినుత ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె… తెలుగింటి అడ బిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పని చేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానని తెలిపారు. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నానన్నారు. తాము ప్రస్తుతం చెన్నై లో ఉన్నామని, త్వరలో తనపైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, సత్యమేవ జయతే అని చెప్పుకొచ్చారు.అంతకు ముందే ఆమె డ్రైవర్ రాయుడు చనిపోవడానికి ముందు సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బులిస్తానంటే తాము కోట వినుత వీడియోలు తీసి ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో కోట వినుతకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వీడియో రిలీజ్ చేసింది. ఈ రెండు వీడియోలపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు.అసలు డ్రైవర్ రాయుడిని కోట వినుత దంపతులు హత్య చేసినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారని, ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ లు కూడా ఉన్నాయని బొజ్జల సుధీర్ తెలిపారు. అయినా బెయిల్ పై ఉన్న వ్యక్తి వీడియోలు చేసి ఎలా రిలీజ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనపైనే కుట్ర జరుగుతోందని వాపోయారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయన్నారు.