తొలి శుభోదయం ప్రకాశం:-
మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో గంజాయి సేవనంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు మాట్లాడుతూ, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే గంజాయి కలిగి ఉండడం, వినియోగించడం, రవాణా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు.ప్రజలు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాల్లో పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజం మొత్తం కలిసి సహకరిస్తేనే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. ప్రకాశం జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.