తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ యువనాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ‘జై అమరావతి’ నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి కోసం సుమారు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతుల పోరాటం వృథా కాలేదని అన్నారు. 1600 రోజులపాటు ఎండవానలను లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు చేసిన ధర్మపోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. “ఇది రైతుల కన్నీటి ఫలితం, వారి దీక్షకు దక్కిన గౌరవం” అని పేర్కొన్నారు.
ఇక గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో అమరావతిని అణచివేయడానికి కుట్రలు చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని స్థితిలోకి నెట్టారని విమర్శించారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి ధర్మమే గెలిచిందని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతేనని ఘంటాపథంగా ప్రకటించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *