తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో గిద్దలూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను గిద్దలూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మీడియా మిత్రులు శుభాకాంక్షలు తెలియజేసి, వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు పి.ఎన్.శేషశయనా రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ.తిరుమల ప్రసాద్,ప్రధాన కార్యదర్శి భూతపాటి ఐజాక్, కోశాధికారి షేక్ ఫాజిల్,ఉప కార్యదర్శి చల్లగాలి పోలయ్య,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి పాలుగుళ్ల విజయ్ కుమార్ రెడ్డి,లైబ్రేరియన్ ఎమ్మె రైడర్ బాబులను శాలువాలతో సత్కరించారు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదులు, సమాజ హితం కోసం నిరంతరం శ్రమించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. సన్మానం అందుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మీడియా మరియు న్యాయ వ్యవస్థ రెండు కళ్లు వంటివని, సమాజంలోని అన్యాయాలను అరికట్టడంలో ఈ రెండు రంగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. తమపై నమ్మకంతో గెలిపించిన న్యాయవాదుల సంక్షేమానికి, అలాగే కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమను గౌరవించి సన్మానించిన మీడియా మిత్రులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ స్థాయి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు………