తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
పట్టణాభివృద్ధికి పన్ను వసూళ్లే ప్రధాన ఆధారం అన్న విషయాన్ని గిద్దలూరు మున్సిపాలిటీ మరోసారి చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, నీటి చార్జీల వసూళ్లలో గణనీయ పురోగతి నమోదు కావడం విశేషం. ప్రైవేట్ ఆస్తులపై 75 శాతం, మొత్తం ఆస్తి పన్నులో 70 శాతం వసూళ్లు సాధించడం ద్వారా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవడం మున్సిపాలిటీ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.అయితే ఇంకా మెరుగుదలకు అవకాశం ఉన్నదనే భావనతో అధికారులు ముందుకు సాగుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు వార్డు సెక్రటరీలు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 70 శాతం వసూళ్లు పూర్తి చేయడంలో భాగస్వాములైన సిబ్బందికి అభినందనలు తెలిపారు.పట్టణంలో రహదారులు, కాలువలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణకు మున్సిపల్ ఆదాయం కీలకమని కమిషనర్ రమణబాబు పేర్కొన్నారు.ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే ఈ సేవలు సమర్థవంతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఇకపోతే, కొంతమంది వద్ద కొనసాగుతున్న మొండి బకాయిలు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బకాయిలపై వడ్డీకి 50 శాతం రాయితీ వంటి సదుపాయాన్ని వినియోగించుకుని వెంటనే చెల్లింపులు చేయాలని పిలుపునిచ్చారు.“మన పట్టణం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, పన్నులు సమయానికి చెల్లించడం ద్వారా గిద్దలూరును మరింత శుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని సూచించారు.