తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, కోడిపందేల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించి నేరస్తులను పట్టుకున్నారు.సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలికివాయ గ్రామ శివార్లలో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి రూ.17,000 నగదు మరియు 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న 6 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,900 నగదు, 6 సెల్ ఫోన్లు మరియు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఇంకా వి.వి. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ల అమ్మపాలెం పొలాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న 4 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి 3 కోళ్లతో పాటు రూ.15,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలు చట్ట విరుద్ధమని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.