జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కీలకంగా మారుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారం లోకి దిగారు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత ప్రచారం కొన సాగిస్తున్నారు. ఎంఐఎం పోటీ చేయటం లేదని భావిస్తున్న వేళ.. త్వరలో నిర్ణయం తీసుకుంటాం అంటూ అసద్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇక.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో కొత్త నినాదంతో ప్రజల మధ్యకు వెళ్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత తరపున పార్టీ ముఖ్య నేత హరీష్ ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. బస్తీల్లో ఓటర్లను కలుస్తున్నారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. ఉద్యోగాలు రావాలన్నా.. పింఛన్లు రావాలన్నా.. పథకాలు అమలు కావాలన్నా.. హైడ్రా ఆగాలంటే బీఆర్ఎస్ గెలవాలని సూచించారు. ఇక, ఇదే సమయంలో కొత్త నినాదం బీఆర్ఎస్ అందుకుంది. మాగంటి సునీతమ్మ గెలుపు మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల గెలుపు అని ఓటర్ల మధ్యకు వెళ్తున్నారు. అదే విధంగా హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్కా చెల్లెల్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు అని హరీష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు, ప్రభుత్వం పోదని.. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలని వ్యాఖ్యానించారు. హైడ్రాతో పెద్దోళ్ల ఇండ్లు కూల్చటం లేదని…పేదోళ్ల ఇండ్లు కూల్చుతున్నరని విమర్శించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి చీఫ్ విప్, గాంధీల ఇండ్లు, భూములు హైడ్రాకు ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తది.. అది రావొద్దు అంటే సునితమ్మను గెలిపించాలని పిలుపునిచ్చారు.