తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు శుక్రవారం భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శక్తి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా గృహ విద్యుత్ పరికరాలు, వాహనాలు మరియు తదితర పర్యావరణానికి హాని కలిగించే వాటిని వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలియజేశారు. అదేవిధంగా అవసరం లేకుండా విద్యుత్ వినియోగం మరియు వాహన వినియోగం చేయవద్దని, అలా చేయడంవల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని తెలియజేశారు. ప్రపంచంలో ఉన్న శిలాజ ఇంధనాలు 60 సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కావున అందరూ వాటి వినియోగంలో జాగురూకతతో వ్యవహరించి, సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తిని వినియోగించుకోవాలని తెలియజేశారు. భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్వి శ్రీహరి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు శక్తి సంరక్షణ పద్ధతులను వివరించారు. సౌర శక్తి , విద్యుత్ వాహనాలు లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించడం ద్వారా శిలాజ ఇంధనాల కొరతను అధిగమించాలని తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు సజీవ మాధ్యమం అని పేర్కొన్నారు. వారి ద్వారా విషయాలు సమాజంలోకి తొందరగా చేరుతాయని, అందువలన కళాశాల విద్యార్థిని విద్యార్థులు తాము ప్రత్యక్షంగా శక్తి వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి మాట్లాడుతూ టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదువేల రకాలు మొక్కలు ఉన్నాయని, వాటి ద్వారా చుట్టుపక్కల గృహాల నుంచి వెళ్లడయ్యే కార్బన్ ఉద్గారాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలియజేశారు. కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ పర్యావరణ పరిరక్షణకు, మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యేఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి రాజగోపాల్, అధ్యాపకులు డాక్టర్ కే .సుజాత, వి వి కృష్ణ శర్మ, బి కమల్ బాబు, డాక్టర్ సీహెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాల విద్యార్థులకు శక్తి సంరక్షణ పైన క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది.
