గాజా శాంతి ఒప్పందానికి మార్గం సుగమమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్(సెనెట్)కు చేరుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “20 మంది ధైర్యవంతులైన బందీలు తిరిగి వస్తున్నారు. ఈ రోజు తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నాయి, సైరన్‌లు నిశ్శబ్దంగా ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ భూమి, ప్రాంతం అనంత కాలం శాంతితో ఉంటాయి.”అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇది సామరస్యానికి ఆరంభమని, ఇది ఒక కొత్త మధ్యప్రాచ్యం (New Middle East) చారిత్రక ఆవిర్భావమని ట్రంప్ పేర్కొన్నారు. “నెతన్యాహుతో వ్యవహరించడం సులభం కాదు, కానీ అదే ఆయనను గొప్పగా చేస్తుంది. ఇది చాలా అసాధారణమైన సమయం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో ఇటీవల జరిగిన కాల్పుల విరమణ, స్థిరత్వాన్ని ప్రస్తావిస్తూ.. “ఆకాశం నిశ్శబ్దంగా ఉంది, తుపాకులు మౌనంగా ఉన్నాయి. పవిత్ర భూమిపై శాంతి ఉంది” అని ట్రంప్ అన్నారు. ప్రసంగానికి అడ్డు: ఇద్దరు గాజా మద్దతుదారుల బహిష్కరణ డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా.. అక్కడ ఉన్న ఇద్దరు సభ్యులు నినాదాలు చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వారు ‘జెనోసైడ్’ (Genocide – మారణహోమం) అనే పోస్టర్‌ను కూడా ప్రదర్శించారు. వీరు గాజాకు మద్దతు ఇచ్చే పార్లమెంట్ సభ్యులుగా భావిస్తున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ ఇద్దరు వ్యక్తులను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు.ట్రంప్ నుంచి అరబ్ దేశాలకు కృతజ్ఞతలు

బందీలను విడుదల చేయడానికి హమాస్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ముందుకు వచ్చిన అరబ్ దేశాలు, ముస్లిం నాయకులకు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. “శాంతి కోసం ఈ దేశాలన్నీ భాగస్వాములుగా కలిసి పనిచేయడం ఇజ్రాయెల్‌కు, ప్రపంచానికి గొప్ప విజయం” అని ఆయన అన్నారు.నెతన్యాహు నుంచి ప్రశంసలు

యుద్ధ విరమణ, బందీల మార్పిడి ఒప్పందం కోసం డొనాల్డ్ ట్రంప్, ఆయన బృందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.”మా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ వలె ప్రపంచాన్ని ఇంత వేగంగా, ఇంత నిర్ణయాత్మకంగా, ఇంత దృఢంగా ముందుకు నడిపించిన వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు.” అని నెతన్యాహు ప్రశంసించారు. “మా శత్రువులకు ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమైనదో అర్థమైంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఒక పెద్ద పొరపాటు” అని నెతన్యాహు అన్నారు. ట్రంప్ ఎన్నికతో రాత్రికి రాత్రే అంతా మారిపోయిందని, ఇజ్రాయెల్ కుటుంబాల కోసం ఈ ఒప్పందాన్ని కుదిర్చినందుకు ట్రంప్‌కు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *