అంబేడ్కర్ ఆలోచనలు,సిద్ధాంతాలు అత్యంత మార్గదర్శకం:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం :-
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేడ్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబేడ్కర్ భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహానుభావులన్నారు. ఆయన సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడిగా అణగారిన వర్గాల అభ్యుదయానికి, కుల నిర్మూలనకు అహర్నిశలు శ్రమించారన్నారు. దళితులు, గిరిజనులు, బహుజనుల సామాజిక హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అయిన అంబేడ్కర్ స్త్రీల హక్కుల కోసం కూడా ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. వివక్షను తొలగిస్తూ, ప్రతి వర్గానికీ సమాన న్యాయం అందేలా రాజ్యాంగాన్ని రూపుదిద్దారని, చట్టం ముందు అందరూ సమానమనే తిరుగులేని హక్కును దేశ పౌరులకు ప్రసాదించిన మహాత్ముడని అన్నారు. ఈ హక్కుల పరిరక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశగా పయనించి, శక్తిమంతమైన దేశ నిర్మాణంలో తోడ్పడాలని ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్బి డిఎస్పీ చిరంజీవి, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పి కె.శ్రీనివాసరావు, సీఐలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నాగరాజు, శ్రీనివాసరావు, శ్రీకాంత్ బాబు, సుధాకర్, పాండు రంగారావు,ఆర్ఐ రమణ రెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
