తొలి శుభోదయం ప్రకాశం:-
‘దిత్వా’ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సముద్ర తీర ప్రాంతాలైన కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, పాకల, ఊళ్ళపాలెం మరియు కనపర్తి బీచ్‌లలో తుపాను కారణంగా సముద్ర అలలు తీవ్రంగా ఉన్నందున బీచ్ ప్రాంతాలకు వెళ్లవద్దని, సముద్రంలోకి దిగరాదని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
భారీ వర్షాలు కురిచే నేపథ్యంలో కాలువలు, చెరువులు, చప్టాలలో నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలను ఎవ్వరూ దాటరాదని, పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. రోడ్లపైకి వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున సుదూర ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవాలని సూచించారు.
విద్యుత్ తీగలు తెగిపడినట్లు లేదా స్తంభాలు కూలినట్లు గమనిస్తే, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు కాల్ చేయండి.