తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-

ప్రజారాజధాని అమరావతికి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం తెలిపి, చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు… శనివారం రాత్రి పలువురు నేతలతో కలిసి ఆయన కొవ్వొత్తులు వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిని అడ్డుకోవడానికి జగన్ అండ్ కో ఎన్నెన్ని కుట్రలు చేశారో ప్రజలు మరిచిపోలేదన్నారు. రైతులను కొట్టించడం, ముఖ్యంగా మహిళలను హింసించిన విధానం చూసి రాష్ట్ర ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల జీవితాలతో ఆటలాడారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ… న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలంతా వెంట నడిచిన విషయాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గుర్తు చేశారు. కందుకూరు నియోజకవర్గం కదిలివచ్చి రైతులకు సంఘీభావం తెలిపిందన్నారు. రైతుల పోరాటం ఫలించి, అమరావతికి చట్టబద్ధత కలిగిందని, చివరకు న్యాయమే గెలిచిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా మారేలా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. జగన్ సహా ఎవరు కూడా , అమరావతిని ఎప్పటికీ ఏమీ చేయలేరని నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కందుకూరు మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, పార్టీ నాయకులు బత్తిన మాల్యాద్రి, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *