తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు, లారీ, బస్, ఆటో మరియు ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు ఉద్దేశించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులపై వాహనాలను ఆపి, డ్రైవర్లు నిద్ర మత్తులో ఉన్నారా లేదా అలసటతో ఉన్నారా అని పరిశీలించి, వారికి ముఖం కడుక్కునే నీరు, టిష్యూ, తాగునీరు అందజేస్తూ అలసట తొలగేలా చేశారు. డ్రైవర్లకు కొంత విశ్రాంతి తీసుకుని మాత్రమే ప్రయాణం కొనసాగించాలని సూచనలు ఇచ్చారు.అలాగే,
👉 వేగ పరిమితులను పాటించడం
👉 మద్యం సేవించి వాహనం నడపకూడదు
👉 నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయకూడదు
👉 సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం
👉 ట్రాఫిక్ నియమాలు పాటించడం
వంటి అంశాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, “నిద్ర మత్తు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఫేస్ వాష్ అండ్ గో లాంటి కార్యక్రమాలు డ్రైవర్లను అప్రమత్తం చేసి, ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి అవగాహన మరియు నిరోధక చర్యలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.