తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ సింగరాయకొండలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా వద్దిపల్లి గ్రామానికి చెందిన యువ న్యాయవాది ఎల్లయ్యపై జరిగిన దాడి, అలాగే చిలకలూరిపేటలో ఒంగోలుకు చెందిన న్యాయవాది రామ హరిప్రసాద్ హత్య సంఘటనలను తీవ్రంగా ఖండించారు.
న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొంటూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడంతో పాటు, న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మరణించిన సహచరులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బక్కమంతల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు కొల్లూరి వెంకట నరసింహారావు, రాఘవేంద్రరావు, సంజీవరెడ్డి, పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *