భద్రత, ట్రాఫిక్, సముద్ర స్నానాలపై కట్టుదిట్టమైన పోలీసుల పర్యవేక్షణ
బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
పాకల బీచ్ ప్రయాణ సూచనలు & పార్కింగ్ వివరాలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
14, 15 తేదీలలో సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ మరియు సముద్ర స్నానాల ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.తో పాటు జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి ఐఏయస్ , రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శుక్రవారం పరిశీలించారు.ఫెస్టివల్‌కు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని బీచ్ పరిసర ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు మరియు కార్యక్రమాల వేదికల గురించి అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక మార్గాలు, వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.సముద్ర స్నానాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే స్నానాలకు అనుమతి ఇవ్వాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మెరైన్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.అదనంగా, ఫెస్టివల్ ప్రాంతమంతా సీసీటీవీ మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేక సిబ్బంది, గస్తీ బృందాలు నియమించామని తెలిపారు. పాకల బీచ్ ఫెస్టివల్ నందు వినోదాత్మక, జబర్దస్ట్ ప్రోగ్రాం, హెలికాప్టర్ రైడ్, స్పీడ్ బోట్స్ రైడ్ వంటి ప్రత్యేక ఆకర్షణగా మరియు వివిధ వంటలు మరియు అనేక రకాల ఆకర్షణలు కలిగిన వెలుగులతో జరిగే ఈ పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.ఈ నెల14, 15 తేదీలలో సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌కు చేరుకొనే మార్గాలు కావలి మరియు కందుకూరు వైపు నుండి వచ్చే మార్గాలు తేది 14.02.2026 మరియు 15.02.2026 న జరుగబోవుచున్న పాకల బీచ్ ఫెస్టివల్ కు విచ్చేయుచున్న కావలి, కందుకూరు వైపు నుండి వచ్చువారు కలికివాయి సర్వీస్ రోడ్ ద్వారా సింగరాయకొండను చేరాలి. అక్కడ నుండి సింగరాయకొండలోని పాకాల రైల్వే గేట్ ద్వారా TP నగర్ మీదుగా పాకల గ్రామానికి చేరుకోవాలి. ఒంగోలు వైపు నుండి పాకలకు వచ్చే మార్గాలు ఒంగోలు వైపు నుండి వచ్చు వారు టంగుటూరు టోల్ ప్లాజా నుండి సర్వీస్ రోడ్ ద్వారా టంగుటూరు గ్రామంలోని రైల్వే అండర్ పాస్ నుండి టంగుటూరు గ్రామ పంచాయతి కార్యాలయం → పురం సెంటర్ → అంబేద్కర్ నగర్ రావివారిపాలెం మీదుగా ప్రయాణించి పాకల బీచ్‌కు చేరాలి.కార్లు మరియు బస్సులలో ప్రయాణించు వారు బకింగ్ హామ్ కాలువ ప్రక్కనుండి కుడి వైపు రోడ్డు నుండి ప్రయాణించి జనరల్ పార్కింగ్ చేరవలెను. మోటార్ సైకిల్ పై వచ్చువారు పాకల గ్రామం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి ఎడమ వైపు రోడ్డు నుండి ప్రయాణించి పార్కింగ్ ప్లేస్ కు చేరవలెను.పాకల బీచ్ కు వచ్చిన వారు తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణంలో పాకల నుండి చెల్లెమ్మగారి పట్టపు పాలెం మీదుగా ఊళ్లపాలెం వచ్చి అక్కడ నుండి సింగరాయకొండకు చేరాలి.ప్రజలు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించి, ట్రాఫిక్ నిబంధనలు అనుసరించాలని, మీతోటి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా నడుచుకోవాలని, మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. పాకాల బీచ్ ఫెస్టివల్‌ను సురక్షితంగా, ఆనందంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112/100 నంబర్లను సంప్రదించాలని ప్రజలను కోరారు.
