తొలి శుభోదయం న్యూస్ విశాఖ,:-

పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజం చేశారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలాశ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి పేర్కొన్నారు. వారి క‌ల‌ను నిజం చేయాలనే దృఢ సంకల్పంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామ‌ని గుర్తు చేశారు. గతంలో ప్రారంభమైన గృహ నిర్మాణ పనులు కొంతకాలం నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని పునఃప్రారంభించి వేగవంతం చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాలో నిర్మాణాలు పూర్త‌యిన ఐదు లే అవుట్ల‌లోని 3600 ఇళ్ల‌ను ఆయా ల‌బ్ధిదారుల‌కు స్థానిక ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల చేతుల మీదుగా సోమ‌వారం అంద‌జేశారు. దీనిలో భాగంగా గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి త‌లారివానిపాలెంలో నిర్వ‌హించిన జిల్లాస్థాయి కార్య‌క్ర‌మంలో మంత్రి, గాజువాక‌, ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్ పాల్గొని ల‌బ్ధిదారుల‌కు తాళాలు, ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి డా. స్వామి మాట్లాడుతూ గత ప్ర‌భుత్వ హ‌యాంలో కొన్ని చోట్ల నాణ్యత లోపాలు, అనవసర ఖర్చులు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బలమైన నిర్మాణాలతో ఇళ్లను పూర్తి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, సౌకర్యవంతంగా నివసించేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ఇప్పటికే లక్షలాది ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని, మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గృహ నిర్మాణంతో పాటు ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, రైతులకు ఆర్థిక సహాయం అందించడం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. విశాఖ నగరాన్ని శుభ్రమైన, భద్రతతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప‌థ‌కాల అమ‌ల్లో దివ్యాంగులకు, మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు అత్యంత అవసరమని, వారి ఆశీస్సులతో ఈ అభివృద్ధి పథం మరింత ముందుకు సాగుతుందని మంత్రి ఈ సంద‌ర్భంగా ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *