తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. శుక్రవారం ఉదయం ఒంగోలు కొత్త మామడిపాలెంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DPTC) ను సందర్శించారు.ఇటీవల ఎంపికైన ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన 193 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు (SCTPC) ప్రకాశం జిల్లాకు కేటాయించబడ్డారు. వీరికి ఈ నెల 22 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి.
జిల్లా ఎస్పీ ట్రైనింగ్ సెంటర్‌లోని పరిసరాలు, మౌలిక వసతులు, బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణా కార్యక్రమాలకు వినియోగించే ప్రదేశాల్లో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ అధికారులకు ఆదేశించారు.మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత నిర్వహణ, శిక్షణార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు నిరవధికంగా, ప్రమాణాలకు తగ్గట్టు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. తదుపరి భాగంగా జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు కలిసి ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు శిక్షణార్థులకు ఆహ్లాదకరమైన, శాంతిమయ వాతావరణం కల్పించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, డిటిసి ఇన్స్పెక్టర్ పాండు రంగారావు,ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐ లు సీతారామిరెడ్డి, రమణారెడ్డి,సురేష్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
