పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 71 ఫిర్యాదులు
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల సవివరాలను తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, తక్షణ పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు అధికారులు భరోసా ఇచ్చారు.పోలీస్ అధికారులు అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రజలకు భరోసానిచ్చే వ్యవస్థగా, న్యాయం అందించే నిబద్ధతతో పోలీసులు వ్యవహరిస్తున్నారని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ మోసాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు, మరియు ఇతర సామాజిక సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని, చట్టపరంగా సరైన దిశలో చర్యలు చేపట్టడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, దర్శి సీఐ రామారావు, కంభం సీఐ మల్లికార్జున రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్ మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
