విద్యార్థుల భద్రతే మా ప్రధాన లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన బస్సులపై పోలీసు మరియు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత, రక్షణను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ తనిఖీలలో పోలీసులు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్‌లు, ఇన్స్యూరెన్స్ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు తదితరాలను పరిశీలించారు.అంతేకాకుండా, బస్సుల్లో ఉండే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, సీటింగ్ సామర్థ్యం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల సందర్భంగా కొన్ని వాహనాల్లో నిర్లక్ష్యంగా నిర్వహణ జరిగినట్లు గుర్తించగా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని పోలీసులు స్పష్టం చేశారు.డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగం వలన కలిగే ప్రమాదాలు వంటి అంశాలపై పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.డ్రైవర్‌లు ఎప్పటికప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవడం, మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపకూడదని ప్రత్యేకంగా హెచ్చరించారు.ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థుల రవాణా బాధ్యతను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, వాహనాలపై రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ అధికారులు ఆదేశించారు.ఉదయం, సాయంత్రం సమయంలో డ్రైవర్ వాహనం తీసుకుని విద్యార్థుల కోసం వెళుతున్న సమయంలో స్కూల్ యాజమాన్యం చెక్ చేసి పంపాలని పోలీసులు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
