తొలి శుభోదయం:-
ప్రజలలో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. కలెక్టరేట్ కు చేరుకున్న జిల్లా సంయుక్త కలెక్టర్ కు బుధవారం ఘన స్వాగతం లభించింది. డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జునరావులు పుష్పగుచ్చాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ, పూర్ణ కుంభంతో స్వాగతిస్తూ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గా భావన వశిష్ట బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలసిన సంయుక్త కలెక్టర్ పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా సంయుక్త కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.బాపట్ల జిల్లాకు సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ జిల్లాలోని పేద ప్రజలకు అందేలా చూస్తామన్నారు. ముఖ్యంగా రెవిన్యూ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా సాగేలా చూస్తామన్నారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ గా వివిధ ప్రాంతాల్లో పనిచేశానన్నారు. ఇంతకు ముందు కృష్ణా జిల్లాలో ఏసి యుటి గాను, పార్వతీపురంలో సబ్ కలెక్టర్ గాను, జిఎస్ ఎస్ డబ్ల్యూ ఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గాను, ఏ ఎస్ ఆర్ జిల్లాలో సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారిగాను పని చేసిన అనుభవం ఉందన్నారు. కాకినాడలో మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తుండగా బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ మేరకు ఇక్కడకు వచ్చామని, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, యన్.రామలక్ష్మి, బాపట్ల మండలం తహశీల్దార్ సలీమా షేక్, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.