తన చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం మాగుంట పాటుపడ్డారు
ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానిది చెరగని ముద్ర
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం ప్రకాశం:-
మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని, ఆయన తన చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం పాటుపడ్డారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కొనియాడారు. మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ఒంగోలు అద్దంకి బస్టాండ్ లో సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి డా. స్వామి నివాళులర్పించారు. అనంతరం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ లో జరిగిన సుబ్బరామిరెడ్డి వర్దంతి సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ….. ప్రజా ప్రతినిధిగా మాగుంట సుబ్బరామిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సుబ్బరామిరెడ్డి పాటుపడ్డారు. విద్యాసంస్థలు నెలకొల్పి ఈ ప్రాంతంలోని పేదలకు విద్యనందించారు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం పాటుపడ్డారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిపై మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసిందని, అందుకే నేటికీ జిల్లాలో ఆ కుటుంబానికి ప్రజా ఆదరణ ఉందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.