తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, గ్రామాలు–పట్టణాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఎడమకల్లు గ్రామంలో, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలతో కలిసి మాదకద్రవ్యాల (గంజాయి, డ్రగ్స్) దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కలిగే తీవ్ర నష్టాలను వివరించి, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా గిద్దలూరు పట్టణంలో కూడా డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం అన్నీ చట్టరీత్యా నేరాలు అని, వాటికి కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనం నేరాలకు దారితీస్తుందని, యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు తమ పరిసరాల్లో డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు–పోలీసుల సమన్వయం అత్యంత కీలకం అని పోలీసులు తెలిపారు.మాదకద్రవ్యాల నియంత్రణ, యువత భవిష్యత్తు పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని మార్కాపురం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
