తొలి శుభోదయం టంగుటూరు:-
మాదిగ ఇనాం భూముల సమస్యపై అధికారికంగా విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆక్రమణదారులు ఏమాత్రం చట్టం పట్ల భయం లేకుండా అత్యంత వేగంగా శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం పట్ల ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బక్క తిరుమలరావు మాదిగ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విచారణ ప్రక్రియను తప్పుదోవ పట్టించే విధంగా సాగుతున్న అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆయన బుధవారం టంగుటూరు డిప్యూటీ తహశీల్దార్ ని కలిసి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకవైపు మండల యంత్రాంగం విచారణ జరుపుతుండగానే, మరోవైపు ఆక్రమణదారులు తెరచాటున అత్యంత వేగంగా భవన నిర్మాణాలు చేపట్టడం, గృహప్రవేశాలకు సైతం సిద్ధపడటం దారుణమని, ఇది పేదల హక్కుల కోసం సాగుతున్న పోరాట ఉనికికే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కొండేపి నుండి ఎన్నికైన మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ మరియు మండల మేజిస్ట్రేట్ వంటి అత్యున్నత అధికారులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, రాజ్యాంగ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారైనప్పటికీ, నేటికీ దళితులకు దక్కాల్సిన భూమి హక్కులు అందని ద్రాక్షలాగే మిగిలిపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దళితులకు రాజ్యాధికారం సిద్ధించాలని కలలు కన్న అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవిస్తూనే, కనీసం మన వర్గానికి దక్కాల్సిన చిన్న భూమి సమస్యనే పరిష్కరించుకోలేని స్థితిలో ఉంటే, ఇక రాజ్యాధికారం దిశగా అడుగులు ఎప్పుడు వేస్తామని వారు ప్రశ్నించారు. కావున, ఈ విషయంలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో యథాతథ స్థితి కొనసాగేలా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన భేటీలో డిప్యూటీ తహశీల్దార్ కి క్షేత్రస్థాయిలో సాగుతున్న అక్రమ నిర్మాణాల తీవ్రతను వివరించి, తక్షణ పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.