తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ పక్షుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పక్షులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గుర్తించిన పోలీసులు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో నీటి పాత్రలను ఏర్పాటు చేసి వాటిలో స్వయంగా నీరు నింపుతూ ఆదర్శంగా నిలిచారు.ఈ వినూత్న చర్య ద్వారా పక్షుల దాహం తీర్చడమే కాకుండా, ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. చిన్న చిన్న పాత్రల్లో నీటిని నింపి ఇళ్ల ముందు ఉంచితే పక్షులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పోలీసులు సూచించారు.మన చుట్టూ ఉన్న జీవజాలాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ఈ సేవా కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పలువురు ప్రజలు పోలీసులను అభినందిస్తూ, తమ ఇళ్ల వద్ద కూడా పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని ముందుకు వస్తున్నారు.ప్రజల సేవలో మాత్రమే కాకుండా ప్రకృతి సంరక్షణలో కూడా ముందుండేలా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *