సామాజిక ఫించన్ల రూపంలో 17 నెలల్లో పేదలకు రూ. 50,773 కోట్లు
ఇది దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం
దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు
పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్ కి ఐదేళ్లు పట్టింది
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం
మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
తొలి శుభోదయం ప్రకాశం:-
పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం ఉదయం కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలోని మల్లవరప్పాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఫించన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డా. శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఎన్నికల మ్యానిఫెస్టులో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ శివపురం గ్రామ పరిధిలో 69 మందికి 2.86 లక్షల రూపాయలు ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 2,83,200 మందికి ప్రతి నెలా 124.74 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సుమారు 63 లక్షల మంది పేదలకు 2,722 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇంతకు ముందు 3వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని 4వేల రూపాయలకు పెంచడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ గత సంవత్సరం జులై నెలలో ఇవ్వడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ ను 3 వేల రూపాయలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పధకం కింద ఇప్పటికే రెండు విడతల్లో 7 వేల రూపాయల వంతున 14 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. మరో విడత 6 వేల రూపాయలు ఫిబ్రవరి నెలలో ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటిన్లను తిరిగి తెరిపించడంతో పాటు పేదలకు 5 రూపాయలకే టిఫిన్, భోజనం ను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో సైడు కాలువలను అభివృద్ధి చేస్తూ భూగర్భ జలాలు పెరిగేలా మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ గ్రామంలో కూడా మ్యాజిక డ్రెయిన్స్ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ గ్రామానికి, మల్లవరప్పాడు గ్రామానికి తాగునీటి పధకాలకు 10 లక్షల రూపాయలు వంతున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఇళ్ళు నిర్మించుకునే పేదవారికి ఇల్లు మంజురుచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే పేదవారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాజంనేయస్వామి తెలిపారు.
