తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా దర్శి మండలం పొదిలి రోడ్డులో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, తలకు తీవ్ర గాయాల కారణంగా సంభవించే ప్రాణనష్టం గురించి వాహనదారులకు సవివరంగా అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా ప్రాణ రక్షణ కవచంగా భావించాలని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.అదేవిధంగా వాహనదారులకు వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, మొబైల్ ఫోన్ ఉపయోగించి వాహనం నడపరాదు వంటి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు.ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.