తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి జూనియర్ కాలేజీ, భాగ్యనగర్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ గారు పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, హెల్మెట్ తప్పనిసరి వినియోగం, ద్విచక్ర వాహనాలపై అనధికారికంగా సైలెన్సర్ మార్పులు చేయకూడదనే అంశాలు, వేగ నియంత్రణ, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని స్పష్టంగా వివరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని, ముఖ్యంగా యువత నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరిగితే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారి, ట్రాఫిక్ నియమాలను స్వయంగా పాటించడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతే ప్రకాశం జిల్లా పోలీస్ ప్రధాన లక్ష్యమని, జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఇలాంటి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
