వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు:పోలీసులు

గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉండి ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

తొలి శుభోదయం ప్రకాశం:-

ఇటీవల చీమకుర్తి మండలం, బండ్లమూడి గ్రామంలో జరిగిన వ్యక్తిగత గొడవ నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం కోసం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు చీమకుర్తి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సిబ్బంది కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధులు, బస్ స్టాండ్, కాలనీలలో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజల్లో నమ్మకం, భద్రతా భావం కలిగించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.అంతే కాకుండా డ్రోన్ కెమెరాలతో ఆకాశమార్గాన నిరంతరం పహార కాస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వి.వి.రమణ కుమార్, చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ మరియు పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడి, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే తప్పుడు సమాచారం నమ్మకూడదని సూచించారు. ప్రజల్లో శాంతి, శాంతియుత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని కోరారు.గొడవకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదు అయ్యి విచారణలో ఉన్నాయని, ఈ ఘటన రెండు కులాల మధ్య వివాదం కాదని, వ్యక్తుల మధ్య జరిగిన గొడవ మాత్రమేనని పోలీసులు తెలియచేసారు.తప్పుదారి పట్టించే వార్తలు లేదా కుల వివాదాలు రేకెత్తించే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *