తొలి శుభోదయం సింగరాయకొండ:-
పండుగలు జరుపుకునే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయాలు పాటిస్తూ జరుపుకోవాలని దానికి భిన్నంగా ఎక్కడైనా ఎవరయినా కోడి పందాలు జూదం బెట్టింగ్ వంటి వాటికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. మంగళవారం ఆయన సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక పోలీసు సిబ్బందితో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అత్యంత ప్రాధాన్యత గల పండగ కావడం తో బంధు మిత్రులతో కలిసి ఆనందంగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పండుగ జరుపు కోవాలని పిలుపు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చిన వాళ్లు పండుగ సంబరాలు క్రమ శిక్షణగా జరుపుకోవాలని తల్లి దండ్రులకు బాధ కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని మహేంద్ర హితవు చెప్పారు.గత అనుభవాల దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీస్ లు, సింగరాయకొండ పోలీస్ లు ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ ఎటువంటి దురుసు తనానికి పాల్పడవద్దని కోరారు. పండుగ పేరుతో ఎక్కడా కోడి పందాలు జూదం బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలకు గురవుతారని ఎస్సై సున్నితంగా హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు కలుగకుండా ప్రజలు పండుగ చేసుకోవాలని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ లకు సహకరించాలని ఆయన కోరారు.