తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షల సన్నాహకంగా ఎస్‌సీఈఆర్టీ నూతన విధానానికి అనుగుణంగా రూపొందించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) మాదిరి ప్రశ్నాపత్ర పుస్తకాలను పంపిణీ చేశారు.టంగుటూరి నివాసి, ఉద్యోగ విరమణ చేసిన గణిత ఉపాధ్యాయులు పీవీ సత్య సుధాకర్, సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు టీ. భాగ్యలక్ష్మి, అలాగే శ్రీ చిరుమళ్ళ రమేష్ అందించిన ఆర్థిక సహాయంతో ఈ ప్రశ్నాపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా శ్రీ పీవీ సత్య సుధాకర్ మాట్లాడుతూ, గణితంలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థినులు పాటించవలసిన ముఖ్యమైన పద్ధతులు, సమయ నిర్వహణ, ప్రశ్నలను అర్థం చేసుకునే విధానం వంటి అంశాలపై విలువైన సూచనలు అందజేశారు. విద్యార్థినులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాంక్షించారు.అలాగే శ్రీమతి టీ. భాగ్యలక్ష్మి గారు, చిరుమళ్ళ రమేష్ మాట్లాడుతూ విద్యార్థినులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి సహాయక కార్యక్రమాలు విద్యార్థినుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల బాధ్యులు శ్రీ జై కేశవరాజు మాట్లాడుతూ, సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు గతంలోనూ మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన ఘనత ఉందని గుర్తుచేశారు. ఆ మంచి పరంపరను ఈ సంవత్సరం కూడా విద్యార్థినులు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.