ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా ఎస్పీ
పాత నేరస్థుల కదలికలపై, వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లాలో నేర దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కేసుల దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచేందుకు జిల్లా ఎస్పీ గారు శుక్రవారం ఉదయం సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీపీఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో స్టేషన్లో జరుగుతున్న పరిపాలనా, దర్యాప్తు కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసర పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రాపర్టీ కేసులకు సంబంధించిన నేరాలపై ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించాలని, దొంగతనాలు, మోసాలు, చోరీలు వంటి నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వాటి నియంత్రణకు మరింత సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాలని సూచించారు. దొంగతనానికి గురైన సొత్తును రికవరీ చేసే విషయంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల సేకరణలో మెళకువలను పాటించాలని, దర్యాప్తులో నూతన పద్ధతులను అవలంభించాలని తెలిపారు.
పదేపదే నేరాలకు పాల్పడే పాత నేరస్థులు, జైలు నుండి విడుదల అయినా నేరస్దుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. ఏదైనా ఒకచోట నేరం జరిగిన తర్వాత, దాని సంబంధించి పూర్తి సమాచారం సేకరించి కేసును కనిపెట్టేవరకు పూర్తిగా నిఘా ఉంచాలన్నారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయాలన్నారు.స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, కేసుల దర్యాప్తు విధానాలు, సాంకేతిక వినియోగం, క్షేత్రస్థాయిలో నిఘాపై కూడా వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, దర్యాప్తులో ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. కేసులు వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. CCS పియస్ నేరాలకు సంబంధించిన నిజమైన సవాళ్లను ఎదుర్కొనే దర్యాప్తు కేంద్రంగా పనిచేయాలని, అధికారులు రాజీలేని ధోరణిలో, పకడ్బందీగా దర్యాప్తు చేసి, నేరాలకు పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడేలా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ గారి వెంట CCS ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్సై వెంకటేశ్వర రెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.