తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమరాజుపల్లి గ్రామంలోని ఆవులవారి పాలెం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ నుండి ఆవులవారి పాలెం వరకు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలాలు సి.సి. రోడ్డుకంటే దిగువ స్థాయిలో ఉండటంతో, వర్షపు నీరు బయటకు పారిపోక ఇంట్లలోకి చేరుతోంది. ఈ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.స్థలాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్త, గడ్డి పేరుకుపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల దుర్వాసనతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదం పెరిగిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిల్వ నీటిలో పాములు, చిల్లు, కప్పలు వంటి విషపురుగులు ఇంట్లోకి రావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
గ్రామ ప్రజలు ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు గారు ప్రదేశాన్ని సందర్శించి, ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి శుభ్రపరిచే చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా, తరువాత ఎటువంటి పనులు జరగలేదని గ్రామస్థులు ఆరోపించారు.
సోమరాజుపల్లి ప్రజలు తక్షణమే రోడ్డు పక్కన కాల్వ ఏర్పాటు చేయాలని, నిల్వ నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పారిశుభ్య చర్యలు చేపట్టి గ్రామాన్ని రోగాల ముప్పు నుండి రక్షించాలని కోరుతున్నారు.
