తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రధాన లక్ష్యంగా హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, తలకు తగిలే తీవ్ర గాయాలు, ప్రాణ నష్టం వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని సూచించారు. హెల్మెట్‌ను భారంగా కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచంగా భావించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు ప్రధాన కారణం తలకు తగిలే గాయాలేనని, ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని కోలుకోలేని దుఃఖంలోకి నెట్టవచ్చని హెచ్చరించారు.అదేవిధంగా వాహనదారులకు వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపరాదు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకూడదు వంటి రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన చోట కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు.ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.