తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ,పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., తెలిపారు.బీచ్ ఫెస్టివల్‌కు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, సముద్ర తీర ప్రాంతం, పరిసర ప్రాంతాలు, వాహన పార్కింగ్ స్థలాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు అన్నింటిలోనూ పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ఫెస్టివల్ రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. బీచ్‌కు వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాలు కేటాయించడంతో పాటు, రెండు చక్రాల మరియు నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేసి, పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తారని చెప్పారు.ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, ఎంట్రీ–ఎగ్జిట్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీచ్‌కు వచ్చే మార్గంలో వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేందుకు క్రేన్లు మరియు టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచుతున్నామన్నారు.సముద్రంలో స్నానం చేసే ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు, మెరైన్ సిబ్బంది, 50 మంది గజ ఈతగాళ్లను నియమించనున్నట్లు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే సముద్ర స్నానాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఎవరూ సముద్రంలో లోతుగా వెళ్లకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించనున్న కాంపిటేటివ్ గేమ్స్, వినోదాత్మక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సురక్షితంగా జరిగేలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమాల వేదికల వద్ద, ప్రేక్షకుల ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా ఉత్సాహంలో మితిమీరకుండా శృతిమించకుండా, నిర్ణయించిన పరిమితులను దాటకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సముద్రంలో ప్రమాదకరంగా ప్రవర్తించకూడదని, మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, వాహనాలను అనుమతించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, ప్రజలందరూ పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.బీచ్ ఫెస్టివల్‌ను సురక్షితంగా, ఆనందంగా, గుర్తుండిపోయే విధంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తెలిపారు.ఫెస్టివల్ ప్రాంతమంతా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు, అనుమానాస్పద కదలికలపై వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని లేదా 112/100 నంబర్లకు గాని తెలియపరచాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, మెరైన్ సీఐ జి.శివన్నారాయణ సింగరాయకొండ ఎస్సై బి.మహేంద్ర, టంగుటూరు ఎస్సై నాగమలేశ్వరరావు, జరుగుమల్లి ఎస్సైబి.మహేంద్ర మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *