తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మండల పరిధిలో 2027 జనాభా గణన (Census) కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని జనాభా గణన సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు మొత్తం 151 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని నాలుగు బ్యాచులుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు మూడు రోజుల పాటు సమగ్ర శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో పని చేసే సిబ్బందికి అవసరమైన అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా ఈ శిక్షణను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ జనాభా గణనలో సెన్సస్ పోర్టల్ ద్వారా (se.census.gov.in) లేదా 1855 టోల్ ఫ్రీ ద్వారా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు స్వీయ గణన ద్వారా ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసి తాము పొందిన ఐడి ద్వారా గృహ గణన సమయంలో తమ వివరాలను అందించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రజలందరూ స్వీయ గణన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఎ. రాంబాబు,ఎ. బ్రహ్మయ్య ఫీల్డ్ ట్రైనర్లుగా వ్యవహరిస్తూ ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు తగిన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. వీరు జనాభా గణనలో అనుసరించాల్సిన విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, సాంకేతిక అంశాలపై సమగ్రంగా శిక్షణ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి ప్రసాద్, ఏ.ఎస్.ఓ ఎస్ శ్రీనివాసులు పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జనాభా గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని అధికారులందరూ సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా సిబ్బంది సమర్థవంతంగా పని చేసి జనాభా గణనను విజయవంతంగా నిర్వహిస్తారని తహసీల్దార్ రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
