కుటుంబ గొడవలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధుడికి పోలీసుల భరోసా
తొలి శుభోదయం ప్రకాశం:-
కొండేపి మండలం, మూగచింతల గ్రామానికి చెందిన చాగంటి హరినారాయణ (65 సంవత్సరాలు) అనే వ్యక్తి తన అక్క మాలపాటి రాజ్యం, మేనల్లుడు మాలపాటి అనిల్ కుమార్ ఇద్దరూ కలిసి తన పొలాన్ని అమ్మనివ్వకుండా, సాగు చేసుకోనివ్వకుండా, కౌలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటూ తనను ఇబ్బంది పెట్టుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు, కొండేపి ఎస్సై బి.ప్రేమ్ కుమార్‌కు చట్టపరమైన చర్యలు తీసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఆదేశాల మేరకు కొండేపి ఎస్సై బి. ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి ఫిర్యాదిదారుడి ఇంటికి వెళ్లి, హరినారాయణ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన అక్క, మేనల్లుడిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. హరినారాయణ ఆరోగ్య పరిస్థితిని గుర్తించి ఆరా తీశారు. ఆయనకు చట్టపరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. కుటుంబ సభ్యులు వృద్ధులను ఎలాంటి సమస్యల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదని, పెద్దల పట్ల గౌరవం, బాధ్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హరినారాయణపై దౌర్జన్యం లేదా దాడికి పాల్పడితే, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టంగా తెలియజేశారు.