తొలి శుభోదయం ప్రకాశం:-

కంభం చెరువు (ట్యాంక్) ప్రాంతం యాత్రికులు, స్థానిక గ్రామస్తులు తరచుగా సందర్శించే ప్రముఖ విహార ప్రదేశంగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు చెరువు ప్రవేశద్వారం వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. చెరువు ప్రాంగణంలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తదితర చెత్త విస్తారంగా పడివుండటంతో సందర్శకులకు ఇబ్బందులు కలగడంతో పాటు పరిసరాలు అశుభ్రంగా మారాయి.మార్కాపురం ఇన్‌చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్, ఐపీఎస్. ఆదేశాల మేరకు కంభం సీఐ శ్రీ కె. మల్లికార్జున, కంభం ఎస్‌ఐ శ్రీ ఏ. శివకృష్ణారెడ్డి చెరువు ప్రాంగణాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. దీనిలో భాగంగా మంగళవారం చెరువు ప్రాంగణంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులను పోలీసు సిబ్బంది పట్టుకొని చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులు, పంచాయితీ కార్మికులు, స్థానిక గ్రామస్తుల సహకారంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామస్తులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని పోలీసులు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించినట్లయితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంభం చెరువు వంటి ప్రజా ప్రదేశాలను అందరూ బాధ్యతతో ఉపయోగించుకోవాలని, పరిశుభ్రతను కాపాడటంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *