తొలి శుభోదయం ప్రకాశం:-

మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ , కనిగిరి సీఐ మరియు హెచ్.ఎం.పాడు ఎస్ఐ నేతృత్వంలో, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో కనిగిరి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను శుభ్రపరిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఓపెన్ డ్రింకింగ్ / ఓపెన్ బూజింగ్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఉన్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధం అని, ఇటువంటి చర్యలు సామాజిక శాంతికి హానికరమని ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు.అదేవిధంగా స్థానిక ప్రజలకు బహిరంగ మద్యం సేవనాన్ని నివారించాల్సిన అవసరం, రోడ్డు భద్రతా నియమాలు, అలాగే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన దుష్పరిణామాలు గురించి అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా, నేరాలకు దారితీస్తుందని, గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం అన్నీ కఠిన చట్టాల పరిధిలో నేరాలు అని వివరించారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై కలిగించే ప్రతికూల ప్రభావాలను తెలియజేస్తూ, యువత ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజా ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, భవిష్యత్తులో కూడా బహిరంగ మద్యం సేవనానికి లేదా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం, గంజాయి వినియోగం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శుభ్రమైన, సురక్షితమైన కనిగిరి పట్టణం సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *