తొలి శుభోదయం ప్రకాశం & మార్కాపురం:-
ప్రజలకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీస్ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతన క్రిమినల్ చట్టాలు (BNS), మహిళల భద్రత, సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు మరియు చట్టపరమైన రక్షణలు వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, అత్యవసర హెల్ప్‌లైన్లు, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు.అలాగే, సైబర్ నేరాల విషయంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, OTP మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా లింకులకు స్పందించకుండా, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు.రోడ్డు భద్రత అంశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ అవగాహన కార్యక్రమం అనంతరం నిర్వహించిన ర్యాలీలో డ్వాక్రా మహిళలు చురుకుగా పాల్గొని, నేరరహిత సమాజం, మహిళల భద్రత, సురక్షిత రహదారులు, సైబర్ భద్రతపై నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమని, మహిళల భద్రత, ప్రజాభద్రతే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖలు స్పష్టం చేశాయి.
